హైదరాబాద్:
సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీలపై జరిగే ట్రోలింగ్‌పై బాలీవుడ్ నటి కృతి సనన్ (Kriti Sanon) సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనప్పటికీ, కొన్ని సంఘటనలు మాత్రం తీవ్రంగా బాధిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి.. తన రాబోయే చిత్రాలతో పాటు సోషల్ మీడియా ట్రోలింగ్, మహిళా ప్రాధాన్య చిత్రాలపై తన మనసులోని మాటలను పంచుకున్నారు.
ఆ చర్చ చూసి షాక్ అయ్యా: కృతి సనన్
ట్రోలింగ్ గురించి కృతి మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా నేను ట్రోలింగ్‌ను అస్సలు పట్టించుకోను. విమర్శలు చేసేవారికి ప్రాధాన్యం ఇవ్వడం నాకు ఇష్టం ఉండదు, అందుకే వదిలేస్తాను. కానీ, ఇటీవల నేను వేసుకున్న డ్రెస్ ఇంత వివాదం సృష్టిస్తుందని అసలు ఊహించలేదు. ఏకంగా ఆరుగురు కూర్చుని ప్రైమ్ టైమ్ న్యూస్ ప్యానెల్‌లో దీనిపై చర్చ పెట్టడం చూసి చాలా షాక్ అయ్యాను. అసలు నా చుట్టూ ఏం జరుగుతోందనిపించింది’’ అని తెలిపారు.
అదే సమయంలో అందరికీ ఒక విలన్‌గా కనిపించాలనిపించిందని, గట్టిగా స్పందించక తప్పలేదని చెప్పారు. ‘‘ఇది కేవలం నా ఒక్కరి సమస్య కాదు. చాలా మంది అమ్మాయిలు ఇలాంటి ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఎలా ఉన్నా మహిళలపై కామెంట్లు చేయడం ఎక్కువయ్యాయి. మన గురించి కామెంట్ చేసే హక్కు అసలు వాళ్లకు ఎవరిచ్చారు? మేమూ మనుషులమే, ఈ ట్రోల్స్ మాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
నాయికా ప్రాధాన్య చిత్రాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
ఇండస్ట్రీలో వస్తున్న మార్పుల గురించి మాట్లాడతూ.. ప్రస్తుతం మహిళల కోసం బలమైన పాత్రలు రాస్తున్నారని తెలిపారు. ఓటీటీతో పాటు థియేట్రికల్ చిత్రాల్లోనూ ప్రాధాన్యత కలిగిన పాత్రలనే నటీమణులు ఎంచుకుంటున్నారని చెప్పారు.
‘‘త్వరలో నేను సోలో లీడ్‌గా ఒక సినిమా చేస్తున్నాను. అందులో ఒక హీరో నటిస్తే ఎంత వసూళ్లు సాధిస్తుందో.. ఆ చిత్రం కూడా అంతటి గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను. ప్రేక్షకుల ఆదరణతోనే ఈ మార్పు వస్తుందని ఆశిస్తున్నా. ఒక మహిళ నటించిన సినిమా భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తే, పరిశ్రమలో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోతాయి’’ అని కృతి సనన్ ధీమా వ్యక్తం చేశారు.
